You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
డా.ఎస్.వి.ఎస్.కిషోర్ కుమార్ గారు రచించిన ఈ నవల ఈ కాలం అమ్మాయిలనే కాదు పెళ్లిచేసుకోబోయే అబ్బాయిలను సైతం ‘జర భద్రం గురూ!‘ అని హెచ్చరిస్తుంది.
నవల ప్రారంభమే ఓ న్యాయవాదికి వచ్చిన స్నేహితుని ఫోన్ కాల్ తో మొదలవుతుంది. మూడునెలల క్రితం కొడుకు పెళ్లి చేసి క్రొత్త దంపతులను అమెరికా పంపించిన స్నేహితుడు కంగారుపడుతూ ఫోను చేయడంతో న్యాయవాది ఆలోచనలో పడతారు. ఆ తర్వాత అమెరికాలో వున్న స్నేహితుని కుమారునికి ఫోను చేసి అసలు నిజాలను గ్రహించిన సదరు న్యాయవాది ఆ భర్తను భార్య నుంచి ఎలా తప్పించాలి? అన్న కోణంలో ఆలోచిస్తూ, స్నేహితుని కొడుకు పెళ్లి చూపుల నుంచి పెళ్లయ్యేవరకు జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కథను నడిపించిన క్రమం మనల్ని మరొక ఆలోచనకు తావులేకుండా కథలో లీనమయ్యేట్లు చేస్తుంది. అమెరికాలో సంతోషంగా గడపవలసి భర్తను భార్య వ్రతాల నెపంతో ఎందుకు దూరంగా వుంచింది? ఆఫీసు నుండి హఠాత్తుగా ఇంటికి వచ్చిన భర్తకు భార్య ఫోను ముందు ఎలా దర్శనమిచ్చింది? ఆ తర్వాత అతను ఏం చేశాడు? దేశం కాని దేశంలో ఆ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి న్యాయవాది సలహాలు ఏవిధంగా ఉపయోగపడ్డాయి? అతన్ని న్యాయవాది అమ్మాయి తరపు నుంచి కూడా ఆలోచించి ఆమె భవిష్యత్తుకు కూడా ఇబ్బంది రాకుండా ఎలా కాపాడారు? ఇదీ నవల సారాంశం.
యదార్థ గాధ అనగానే ఒకింత ఉత్సాహం తో చదవడం ప్రారంభించిన మనల్ని నవల ఓ రకమైన ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆత్రుత మనల్ని నవలను ఏకబిగిన చదివిస్తుంది.
ఫేస్బుక్, వాట్సాప్, వీడియో కాల్స్ వీటన్నింటి వల్ల యువత పెడదారిన ఎలా పడుతున్నారో ఎన్నో వ్యాసాలు చదువుతున్నప్పటికీ, ఈ యదార్థ గాధ మనల్ని ఒకింత ఉద్విగ్నతకు గురి చేస్తుంది. తల్లితండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా వ్యవహరించకపోతే జరిగే పరిణామాలను రచయిత తన నవల ద్వారా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇలాంటి సామాజిక చైతన్యాన్ని కలిగించే మరెన్నో రచనలు రచయిత కలం నుంచి వెలువడాలని ఆశిస్తూ......
రేణుక జలదంకి
యువత, తల్లితండ్రులు తప్పక చదవాల్సిన నవల
నేటికాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతకాలం పెళ్లిబంధం ఉంటోంది అన్నది చాలా సంక్లిష్టమైన సంగతి. పీటలమీద పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయి. పెళ్ళైన కొద్దిరోజుల్లోనే విడాకులు తెచ్చుకుంటున్నారు. వివాహబంధం చాలా తేలికగా తీసుకుంటున్నారు. అదొక పవిత్ర బంధం అని తెలుసుకోలేకపోతున్నారు. ఒక యదార్ధ సంఘటన ఆధారంగా రచించబడిన ఈ నవల ఒక విధంగా నేటి యువతకు కనువిప్పు కలిగించేలా ఉంది. నవల చాలా ఉపయోగకరంగా ఉంది. ఊహల్లో తేలించినట్లు కాకుండా నిజజీవితాన్ని ప్రతిబింబించి భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకునేందుకు దోహదపడుతుంది. అందరూ చదవవలసిన నవల అని నా అభిప్రాయం. రచయితకు ప్రత్యేక అభినందనలు.