You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ప్రస్తావన
కథలు కానీ, కవితలు కానీ పుట్టడానికి ఒక చిన్న సందర్భం చాలు. అది మనసుకు హత్తుకుంటే దాన్ని అనుభవించిన మనసు దాని గురించి తన ధాటీలో ఆలోచిస్తూ, రంగులు పులమగలిగే శక్తి మనసుకుంది.
ఈ పుస్తకంలో జరిగినదీ అదే.
మనందరికీ సావిత్రీ సత్యవంతుల కథ ఒక పురాణ కథగా తెలుసు. అల్పాయుష్కుడైన సత్యవంతుడి ప్రాణాలను అతడి ఆయుష్షు తీరిపోగానే తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు వెంటబడి, తన తార్కికమైన ప్రశ్నతో తికమకపెట్టి తన పతి ప్రాణాలను తిరిగి తెచ్చుకున్న పతివ్రతగా మనం సావిత్రిని ఎరుగుదుము. ఈ కథను పురాణాల్లోనూ, వీధి నాటకాల్లోనూ, చలన చిత్రాలలోనూ మనం చిన్నప్పటినుండి చూశాము. సావిత్రిని సాధ్వీమణిగా గుర్తించాము కూడా. మన మహిళలు తమ సౌభాగ్యం కోసం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమనాడు వట సావిత్రీ వ్రతాన్ని చేసుకుంటారు. ఇక్కడ మనం ఎంతసేపూ ఆమె పాతివ్రత్యం గురించి, ఆమె యొక్క తెలివి గురించి మాత్రమే మాట్లాడుకుంటాం.
కానీ “రవిగాంచనిది కవి గాంచును” అన్నట్టు రామమోహన్ గారు తమ కవి హృదయంతో సావిత్రీ సత్యవంతుల ప్రథమ పరిచయాన్ని తిలకించారు. ఒక మహిళ తన బుద్ధిబలంతో పతి ప్రాణాలను తిరిగి పొందడం వలన ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిందో, అలా ప్రాణాలను తిరిగి పొందిన ఆ భర్త కూడా అంతే పేరున్నవాడుగా మనం పరిగణించాలి. అలాంటి పురాణ వ్యక్తుల ప్రథమ పరిచయం ఒక మహత్తర ఘటనకు దారితీయడం జరిగిందన్నాక ఆ ఘట్టం ఒక మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. అలాంటి తొలి పరిచయాన్ని ఎంతో రమణీయంగా వర్ణించాలనుకుని తన కవి హృదయంతో వంద చతుష్పాదాలతో పద్యాలల్లారు రామమోహన్ గారు.
ఆయన కవి హృదయం వాళ్ళిద్దరి మనసులలో మెదలిన భావనలతో పాటు, చుట్టూ చూసి పులకించిన ప్రకృతి వర్ణనలను కూడా మనకు పరిచయం చేస్తుంది. అంధుడైన తన తండ్రితో పాటు అడవులకు వచ్చిన సత్యవంతుడు తన జీవితం ఎంత నిస్సారంగా గడుస్తూ ఉందో సావిత్రికి చెప్తూ, ఆమె రాక తన బ్రతుకులో కాంతి రేఖలు చిందించినట్లు పేర్కొంటాడు “ఓ సావిత్రీ సవితుర్వరేణ్య హిరణ్య గాయత్రీ” . “నిశబ్ద నీరవ నిశీధిలో నను చేరవచ్చిన మణిదీపమా” “దిగంతాల పాలపుంతలోని తళుకులీను చంద్రకాంతివా” అని సంబోధిస్తూ ఆమె రాకను ఆహ్వానిస్తూ రాసిన పంక్తులు కవి రామమోహన్ గారి కల్పనా లహరిని, పదాల పైన పట్టును మనకు తెలియబరుస్తాయి. సావిత్రి అందాన్ని వర్ణిస్తూ కవి రాసిన “దివికన్యకు భువి తావి అబ్బిందా” “సున్నితంగా అలసిన సువర్ణ సుందరీ” లాంటి విశిష్ఠమైన ప్రయోగాలు కృతికి అందాలద్ధుతాయి.
“ఎదగని వయసులో రంగురంగుల రాళ్ళను ఏరే పసితనం” “ఎదిగిన వయసులో రంగురంగుల ప్రకృతిని ఆరాధించే పరవశం” పంక్తులలో సందర్భాలకు అతికినట్టుగా పదాలను వాడే ప్రతిభ కనిపిస్తుంది. సావిత్రి సత్యవంతుడిని అడుగుతూ “పరువాల పంచకళ్యాణికి కళ్ళెం ఎందుకు బిగించావు?” అన్న ప్రశ్నలో ఒక యౌవన జిజ్ఞాస తొంగిచూస్తుంది. “గమ్యస్థానం తెలుసు, గమనం తెలీడం లేదు” “సూర్యుడి వెలుతురు భరించగలిగాను, సూర్యుడి తేజాన్ని కాదు” “అంతానికి అనంతానికి ఉన్న అనుబంధం ఏమిటి” లాంటి పంక్తుల్లో విపరీతార్థాలను గమనించవచ్చు. ఇది ఆయనకు తెలుగు సాహిత్యం పట్ల ఉన్న మక్కువ, ప్రవేశం, ప్రావీణ్యతను తేటతెల్లపరుస్తాయి.
ఇలా చెప్తూ పోతే ఈ చిన్న పుస్తకాన్నంతా నేనే చెప్పినట్లయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, ఇంతటితో ఆపేస్తాను.
తన ఈ పుస్తకాన్ని చదివే అవకాశం నాకిచ్చిన గజ్జెల రామమోహన్ గారికి నేను కృతజ్ఞుణ్ణి. దాంతో పాటే దీనికి ముందుమాట రాయమనడం నాకొక అరుదైన గౌరవం అని భావిస్తాను. ఆయన ప్రయత్నాన్ని పరిచయం చేయడంలో ఎంతవరకూ నేను కృతకృత్యుడనయ్యాను అన్నది చదువరులే చెప్పాలి. చదివి ఆనందించిన నాడు కృతికర్త కృషి ఫలించినట్టే.
వందనాలు.
బడంగ్ పేట్ చందకచర్ల రమేశబాబు
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book సత్ సవిత్ వరేణ్యం: A POETIC TRIBUTE TO THE ETERNAL LOVE STORY OF SATI SAVITRI AND SATHYAVANTHA.