Description
ఈ పుస్తకం 1983,1984 ప్రాంతాల్లో ఇండియాలోనూ, స్విట్జర్లండ్ లోనూ, కాలిఫోర్నియాలోనూ యూజీ కృష్ణమూర్తి విజ్ఞాన శాస్త్రజ్ఞులతో సహా వివిధరంగాలనుంచీ వచ్చిన మేధావులతో జరిపిన సంభాషణల సంకలనం. యూజీ “The Mystique of Enlightenment, జ్ఞానోదయ రహస్యం” అనే పుస్తకానికి ఇది సహచారి గ్రంథం. దానికీ దీనికీ కొన్ని పోలికలున్నా, వీటి మధ్య తేడాలు కూడా చాలా ఉన్నాయి. మనసూ లేదు, మానసికమైనదీ లేదు, భౌతిక జీవ స్పందనలు తప్ప,.. అంటాడు యూజీ. అనుకోకుండా ఆయనలో ఒక సమూల జీవకణ పరివర్తన జరిగి ఆయనకు ప్రాప్తించిన సహజస్థితిని గురించి వివరిస్తూ యు.జి. అంటాడు, “నిజంగా ఇది అద్భుతాల్లో అద్భుతం. ఈ ఘటన అకారణం. నిష్కారణమైనది. ఇదొక అనుభవం కాదు, అందువల్ల దీనిని యితరులకు తెలియజేయడం గానీ, మరొకరిలో జరిగేట్టు చేయడంగానీ సాధ్యంకాదు. ఈ స్థితిలో జ్ఞానేంద్రియాలు ఆలోచన యొక్క నియంత్రణ లేకుండా, వాటి పనులను అవి స్వతంత్రంగా చేసుకొంటూపోతాయ్. ఇకపై ఏ ప్రశ్నలూ లేని స్థితి యిది.” అన్నివిషయాలనూ తనదైన బాణిలో, సొంత వాణిలో, అనేక కోణాల్నించి, భౌతికజీవశాస్త్రపరంగా, అద్భుతంగా ఆవిష్కరించాడు యూజీ. విస్మయం కలిగించే విషయాలు యింకా చాలా ఉన్నాయ్ యీ పుస్తకంలో.
అనువాదకుని గురించి
జననం, 1949 జూన్ 26న. పశ్చిమ గోదావరి, పాలకొల్లు పక్క పల్లెటూరులో. పెరిగింది సఖినేటిపల్లిలో. 1966-71 లో ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టభద్రత. ఆ టైమ్ లోనే, వివేకానంద, గాంధీ, శరత్ చంద్ర, ఠాగోర్, ప్రేమ్ చంద్, గోపీచంద్, చలం, బుచ్చిబాబు, రావిశాస్త్రి, కార్ల్ మార్క్స్, శ్రీశ్రీ మొదలైన వారి పుస్తకాలు చదివడం జరిగింది. చుట్టూ కనపడే దారిద్ర్యం, అన్యాయం, అవినీతి, మతపర మూఢ నమ్మకాలూ మనసును కలచి వేసాయ్. ఏదో రాయాలనే కోరిక కొన్ని కథలతో ఆగింది. అక్కడే జరిగింది, మతపర నమ్మకాలనుండీ, ఛాందస సంప్రదాయ సంస్కృతుల నుండీ అంధ విశ్వాసాల నుండీ,శాశ్వత విముక్తి. కాకినాడ JNTU లో M.Tech. చదువుతుండగా మధ్యలో BHEL ఉద్యోగంలో జేరడం తరవాత. 2003 లో BHEL నుండి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ.
తత్వశాస్త్రం(ఫిలాసఫీ)లో నాకున్న అభిలాష, వేదోపనిషత్తులూ, భౌద్ధం, బైబిలు, ఖురాన్, పతంజలి, రజనీష్, మహేష్ యోగి మొదలైన, ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలూ చదివించింది. దేవుడే కాదు, ఆత్మ, మనసు, time, free-will అనబడేవేవీ కూడా అసలు లేనేలేవని నిర్ధారణ అయింది. నాలోని శేష ప్రశ్నలకు జవాబులు యింకా వెతుకుతుండగా, జూన్ 2015 లో, జిడ్డు కృష్ణమూర్తి గ్రూపు లోని ఒక మిత్రుని ద్వారా యు.జి. కృష్ణమూర్తిగారిని గురించి వినడం, వెంటనే యూజీ పుస్తకాలు చదవడం జరిగింది. యూజీ మాటల్లో ఏదో తెలియని కొత్తదనం కనిపించి, ముఖ్యమైన యూజీ పుస్తకాలలో ఒకటైన The Mystique of Enlightenment అనే పుస్తకాన్నీ మరియూ “About UG” అనే వ్యాస సంపుటినీ, ‘జ్ఞానోదయ రహస్యం’ & “యూజీ గురించి” అనే శీర్షికలతో, తెలుగు చేయడం జరిగింది.” ఆ వరసలో యీ ‘Mind is Myth’ పుస్తక అనువాదం మూడవది. “మానసికమైనదంటూ ఏదీలేదు, ఉన్నదంతా భౌతికమైనదే’ అంటాడు యుజీ.
జె. యస్. సుబ్రహ్మణ్యం, హైదరాబాద్
josyulass4@yahoo.com, 9440724540