You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఒక నేల - కొన్ని గొంతుకలు.
మదనపల్లె పేరు వినగానే నాకు గుర్తొచ్చేది ప్రత్యక్ష పరిచయం ఉన్న ప్రముఖ సాహితీవేత్తలు ఆర్ఎస్ సుదర్శనం, ఆర్.వసుంధరా దేవి, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, టీఎస్ఏ కృష్ణమూర్తిగారలు. వారి కంటే ముందు జిడ్డు కృష్ణమూర్తి, శంకరంబాడి సుందరాచారి, జోలపాళెం మంగమ్మ, లీలా నాయుడు, మల్లెల గురవయ్యలు చిరస్మరణీయులు. గురవయ్య గారు మొదలుపెట్టిన మదనపల్లి రచయితల సంఘం ఈనాటికీ సజీవంగా నిలబడి జవసత్వాలు పుంజుకోనే క్రమంలో ఈ కవితల సంపుటిని మన ముందుకు తెచ్చింది. మరసానికి పునర్జీవనం తెచ్చేందుకు రవిశేఖర్ రెడ్డి గారు చేస్తున్న కృషి ప్రశంసనీయం.
ముప్పైఒక్క కవితలతో కూడిన ఈ కవితల సంపుటి పూర్తిగా చదవగానే, అక్కడక్కడా తళతళమని మెరుపులు మెరిసినట్లుగా వెలిగే ఉపమానాలతో తొలకరి మేఘాల ఆకాశంలా కనిపించింది పుస్తకం.
"ఆకలి కడుపుకు అన్నం పెట్టే చేతులలో
ఎంత సౌందర్యం దాగుందో కదా!" -- అన్న విజయ్ కుమార్ గారి వాక్యాలు చదవగానే పేజీల్ని వదలబుద్ధి కాలేదు. అవయవాల రంగు సౌష్టవాలకన్నా అవి చేసే మంచిపనుల వల్లే సౌందర్యవంతంగా కనిపిస్తాయని చెప్పిన తీరు బావుంది.
" ఎవడి అహంకారానికి వాడే నిప్పు పెట్టుకొని
ఆ వెలుగులో కొత్త దేవుణ్ణి వెతుకుదాం" అన్న వెంకటాచలపతి పద్య పాదాలు నిజంగానే మన గుండెల్ని మనం తడువుకొనేలా చేస్తాయి.
"నేల గట్టిగా ఉందంటూ విత్తు పైకి రానంటే
మహావృక్షమయ్యేనా మొగ్గ చిగురు తొడిగి" రామిశెట్టి రాసిన ఈ పద్య పాదాలు పాఠకున్ని కొంత సేపు ఆపి ఆలోచింపజేస్తాయి.
" దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోంది
ఆకలి చావులను అనాధ జీవులను
ఉక్కుపాదంతో అణచివేస్తూ ....." ఈనాటి రాజకీయాన్ని ముళ్ళుగర్రతో పొడిచినట్లుగా ఎంత వ్యంగంగా చెప్పాడని నవజీవన్ రెడ్డి!
అతనికి వెన్నుదన్నుగా ......
"చట్టాలు నిందితులకు చుట్టాలు కాగా
చెరసాల నిందితులకు విడిది ఇల్లాయె" అంటూ వాపోతాడు రామచంద్రారెడ్డి.
"ఎక్కడైనా వైమానిక దాడులు జరిగితే
కూలేవి కట్టడాలు కొంపలు కాదు
లేత మొక్కల్లాంటి బాలల తల మీది నీడ-
తల్లిదండ్రుల రెక్కల నీడ - " అంటూ యుద్ద భూములైన దేశాల్లోని బాలల దయనీయ స్థితిని కళ్ళకు కట్టినట్లు చెప్పాడు ఆకుల మల్లేశ్వరరావు.
'సాహిత్యం కొలువైన ఆనంద నిలయం మదనపల్లి' గురించి జొన్నవిత్తుల వారు తనదైన శైలిలో గుక్క తిప్పుకోకుండా చెప్పిన విధానం హృద్యంగా ఉంది. బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో వలస జీవుల గురించి రవిశేఖర్ రెడ్డి రాసిన 'కన్నీరుగా కరిగిన గీతం" చదివి తీరాల్సిందే.
' మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించమని' మాజీ సైనికుడైన రామ్మోహన్ నాయుడు చెప్పినా, సంక్రాంతి సంబరాలను గతకాలపు సంస్కృతీ సంప్రదాయాల్లోంచి తోడి మన ముందుంచి తీయని బాధకు గురిచేసిన ప్రతాప్‌కుమార్‌రెడ్డి కవిత చదివినా, 'సాధనకు విశ్వాసం తోడైతే విజయ శిఖరాలను చుంబనం చేయదా!' అంటూ కుమారస్వామి ఆత్మవిశ్వాసం చూపెట్టినా, ఉగాది ఉషస్సులతో మనల్ని నిద్రలేపేందుకు నాగరాజు ప్రయత్నించినా, 'స్నేహగమనంలో విరులు పరిమళించేలా' ప్రసన్న లక్ష్మి పద్యం చెప్పినా ఎవరి దృష్టి కోణం వారిది. ఎవరి వ్యక్తీకరణ వారిది.
" ఆమె ఎవరో తెలీదు
కన్నీరు ఇంకిపోతున్నా కాలం కరిగిపోతున్నా
విషాద ఛాయలో ఇంకా తను అలాగే -
ఆమెను చూస్తూ ద్రవిస్తూ అతను ..." అంటూ
మనిషంతా పిడికెడు గుండె అయి స్పందించే దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలిపిన మోహనవల్లిని తనివితీరా చదవాల్సిందే.
అందమైన ప్రేమలేఖ రాసిన స్రవంతి, తెలుగు మీద ప్రేమ వెలుగును పరిచిన హసీనా బేగం, పరోపకారి వృక్షాన్ని గురించి పొగిడిన సురభి హేమలత, కాలం తప్ప మరో నేస్తం మనకు లేదని బల్ల గుద్ధి చెప్పిన పివి ప్రసాద్, 'కాలంతో కలిసి నడకదారి చూపించే దిక్చూచి గతం' అని నిబ్బరంగా చెప్పే సి.హేమలత, తెలుగుకు తెగులు పుట్టిస్తోన్న పరిస్థితుల గురించి వాపోయే సురేష్, 'వేటాడేందుకు మాటేసుకున్న పులిలా కనిపించిన పుస్తకం' చివరకు 'పులికానే కాదు అక్షర కల్పవల్లి, విద్యా సుగందాలు పరిమళించే జాజిమల్లి' అంటూ అక్షరానుభూతిని పాఠకుల గుండెలకు ఎత్తిన మౌని ఇంకా ఎవరి పరిధిలో వారు లోకరీతుల్ని, ప్రకృతి సౌందర్యాన్ని, మానవ హృదయ నైర్మల్యాన్ని అక్షరాలకెత్తి ప్రదర్శించిన తీరు అభినందనీయం.
ఒక ప్రాంతం నుంచి ప్రత్యేకంగా వస్తోన్న సాహిత్యం - అది కథ కావచ్చు కవిత్వం కావచ్చు - అక్కడి ప్రాంతీయతను ప్రతిబింబించేదిగా వుంటే బాగుంటుంది. అలాంటి పుస్తకాలు చేతికి తీసికొన్నపుడు పాఠకుల వెదకులాట ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాల కోసమై వుంటుంది. ప్రాంతీయత నేరమేమీ కాదు. ప్రపంచంలో వచ్చిన గొప్ప సాహిత్యమంతా ఏదొక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిందే.
ప్రత్యేక సంపుటి కోసం రాస్తున్నప్పుడు తాలు తరక చెరిగేసి, మట్టి రాళ్ళు ఏరేసి గట్టిగింజలను విత్తితే పైరు బలంగా వుంటుంది.
నిష్ణాతులైన కవుల్ని, ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తొన్న అక్షర ప్రేమికుల్ని, అనుభూతుల్ని వాక్యాల్లో అందంగా ఇమిడ్చేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోన్న సాధకుల్ని ఒకచోట చేర్చి మరసం వేదిక మీద కవితా గానం చేయిస్తోన్న నల్లపరెడ్డి రవిశేఖర్ రెడ్డి గారికి అభినందనలు.
..... సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి .
బాలరాజు పల్లె.16.03.2024
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Kavithalahari.