Description
ప్రేమ రైల్వేలో పని చేస్తున్న ఒక ఆఫీసరు గారి కూతురు. తండ్రి ఏమి పట్టించుకోడు, తల్లికి మనస్థిమితము లేదు. ప్రసవములో బిడ్డ పోవడముతో తల్లి మనస్థిమితము తప్పింది. తల్లి తండ్రుల ఆలనా పాలనా లేక పోవటముతో, ప్రేమకు లౌక్యముగా మాట్లాడటము తెలియదు, అసలు ఆ మాటకు వస్తే ఆమెకు మాట్లాడటమంటేనే సిగ్గు. దాని వల్ల ఆమె చేత అందరూ పనిచేయించుకోవటమేగాని, కాస్త జాలి ప్రేమ చూపినవారు లేరు. ప్రేమ కూడా అదే తన జీవన సరళి అనుకునేది. ప్రేమకు ధైర్యముగా మాట్లాడటముగాని, ప్రవర్తించటముగాని, స్వశక్తిమీద ఆధారపడటముగాని తెలియదు.
ఆమె జీవితము ఒక మంచి డాక్టరు రాకతో మలుపు తిరిగింది. ఆ డాక్టరు చూపిన ఆప్యాయత, నేర్పిన జీవన విధానము, చూపించిన దారి మరియు ఆమెలో నింపిన ధైర్యము ప్రేమకు కొత్త పంధా చూపించింది.
కానీ డాక్టరుగారు చూపించిన ప్రేమతో, చుట్టూ వున్న రాబందుల్లాంటి మనుష్యులనుంచి తనను కాపాడుకోవటము, తన జీవితాన్ని తీర్చి దిద్దుకోవటమే మన కథా నాయిక ప్రేమపై ఉన్న అసలైన బాధ్యత. ఏమి చేస్తుందో చూద్దాం మరి........
వసుంధరా దేవి (1954-2009) రాజమండ్రి, ఆంధ్ర ప్రదేషలో, April 10, 1954 నాడు వడ్డాదివారి కుటుంబంలో జన్మించినారు. ఆమెకు ఒక అక్క, ఒక తమ్ముడూ ఉన్నారు. ఆమె తండ్రి ఉద్యోగ రీత్య రైల్వేలో పనిచేసేవారు. అందువలన బయటి ప్రపంచానికి వారి కుటుంబము ఆర్థికంగా బాగా ఉన్నట్టు అనిపించినా, కాని ఆమె తల్లి జబ్బు వల్ల, ఇతర పరిస్థితులవలన ఆ యింటిలోని ముగ్గురు పిల్లలు ఎటువంటి ఆలనా, పాలనా లేకుండా పెరిగారు. వారికి బయట ప్రపంచానికి అనిపించే ఆర్థిక పరముగ వచ్చే సుఖాలు ఏమి తెలియవు, అనుభవించలేదు కూడా. అటువంటి పరిస్థితులలో పెరిగిన వసుంధరా దేవి చాలా సున్నిశిత మనస్సుతో, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మానవ ప్రవర్తనను, వాటి ఉచ్ఛ నీచాలను చాలా చక్కగా అర్థం చేసుకొని, తన జీవన కాలములో అటువంటి పరిస్థితులను ఎలా ఎదురుకోవాలో బాగా జీర్నించుకొంది.
వసుంధరా దేవి తన జీవిత కాలమంతా మానవతా వాదాన్ని, ప్రేమను వీలైనంత మందికి తెలియ పరిచింది. పేదలకు సహాయ పడటము వారిని ప్రేమించడటము ఆమె పరమోద్దేశము. ప్రకృతిని కాపాడుట, మొక్కలు, చెట్లు నాటటము అంటే ఆవిడకు ప్రాణము.
భర్త ఉద్యోగ రీత్య, రాంచీలో వున్నన్ని రోజులు, ఆమె యిదే ఉద్దేశాలమీద నడిచింది. అక్కడ వసుంధరా దేవి కనీసము పది వేల చెట్లు, మొక్కలు నాటింది. అందుకనే అక్కడి వారంతా ఆమెను "Green Lady”అనే వారు. ఆమె భర్త ఆఫీసులో పనిచేసే ఒక ఆఫీసరు రిటైరైన తరువాత వ్రాసిన కథల సంపుటిలో “Green Lady”అన్న శీర్షికతో వ్రాసిన కథ వసుంధరా దేవి గారి గురించే. పర్యావరణ సంరక్షణేగాక, ఆమె పేద పిల్లలకు కూడా తల్లి లాంటిదే, లేక తల్లెనేమో అనిపించేది. ఆమె పదిహేనుమంది పేద పిల్లల్ని చేరదీసి వారికి పర్యావరణ సంరక్షణ నేర్పించింది. అటు తరువాత, వారిని అందరిని ప్రోత్సహించి స్కూలులో దాఖిలా చేయించింది.
యిటు పర్యావరణ సంరక్షణ చేస్తూ, అటు పేద పిల్లలికి చదువు చెప్తూ, వారికి రోజూ తిండి వండి పెడుతూ కూడా తన రచన వ్యాపకాన్ని కొన సాగిస్తూ వచ్చింది. తెలుగులో ఆమె కథలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. పదిహేన్నేళ్ళ వయసులోనే ఆమె మొదటి కథ "తాయారమ్మ ఎక్సెర్ సైయిజ్" పత్రికలో ప్రచురితమయింది. ఈ కథకి బాపూగారు గీచిన బొమ్మలు మరింత అందాన్నిచ్చాయి. పెళ్ళి కాకముందు ఆమె "హిమబిందు" అనే పేరుతో కథలు వ్రాసేది. పెళ్ళి తరువాత "ముక్కామల వసుంధరా దేవి" పేరుతో ఆమె వ్రాసిన "ఎలెన్ ఫారెస్ట్ “, "స్టార్ హోటల్ “, "రాజ్ “, లాంటి ఎన్నో కథలు ప్రచురించింది. కథలేకాక ఆమె చాలా నవలలు (అముద్రితాలు) కూడా వ్రాసింది. ఆమె రచనలన్నిటిలోను బాగా ప్రస్ఫుతమైయ్యేవి, మానవ ప్రవర్తన, మనోభావాలు, ధనవంతుల మనోరీతి, ఏవిధంగా ధనవంతులు ఆర్భాటానికి మిగతా ధనవంతులను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారో, పేదలను ఎలా కించ పరచుతారో, ఆమె తన రచనలలో చాలా చక్కగా చూపించింది. మగవాని సంఘంలో ఆడవారి బాధలు, వారి మనోఘర్షణ, ఆమె తన రచనలలో బాగా ప్రస్థావించింది. ఆమె రచనలలోని పాత్రలు కొంచెము వింతగా ఉన్నా కాని, మనకు చాలా పరిచయమున్నట్టుగా వుంటాయి. కొన్ని సార్లు ఆ పాత్రల స్వభావాలు, మనలో కూడా ఉన్నట్లు అనిపించేలా ఆమె రచనలు చేసింది. ఆమె ప్రతి రచన, చదివిన తరువాతకూడా మనలని ఆలోచించడానికి ప్రోద్బలము చేసేలా వుంటాయి.
ఆవిడ "పిల్లల పర్యావరణ సేన" గురించి, ఆవిడ సామాజిక కార్యాల గురించి మరిన్ని వివరాలు మీరు ఈ కింది వెబ్ సయిట్ లో తెలుసుకొనగలరు.
http://sites.google.com/site/greenlandkasu/
http://devimv.wordpress.com/