You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
ఆమె ఆటోగ్రాఫ్
ఓ పరి‘పూర్ణ’మైన విజయపతాకం
‘‘కొన్ని లక్షల మందిలో అవకాశం మన గుమ్మం తొక్కింది.
నాకు సమానత్వం ఎలుగెత్తి చూపే అవకాశం వచ్చింది.
మీరు నన్ను మనసార ఆశ్వీరదించి పంపండి.
మీ ఆశీస్సులతో క్షేమంగా తిరిగి వస్తాను.
దయచేసి నన్ను పంపండి. నేను వెళతాను’’…ఈ మాటలు ఎవరివో కాదు
13 ఏండ్ల మాలావత్ పూర్ణ పలికినవి. తాను వెళ్ళేదెక్కడికో పాఠశాలకో, విదేశాల్లో విహారయాత్రకో కాదు; ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి!తరతరాలుగా తన జాతి ఏమీ సాధించలేదంటే, తాను సాధించి చూపించడానికి! విజయం సాధించడానికి పట్టుదల, తెగువ కావాలి తప్ప కుల, మతం, వర్గ, లింగభేదాలు కావని నిరూపించడానికి!ఇలాంటి ఓ గొప్ప సాహసాన్ని, తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన అత్యంత పేదరికంతో జీవించే ఒక గిరిజన యువతి విజయగాథే సుధీర్ రెడ్డి పామిరెడ్డిగారు రాసిన ఎవరెస్ట్ ఇన్ మైండ్
ఎవరెస్ట్ ఇన్ మైండ్ …పేరులోనే పెన్నిధిని పలికించే ఈ పుస్తక రచయిత సుధీర్ రెడ్డి పామిరెడ్డి గారు నాకు తెలిసినంతవరకు విస్తృతమైన అధ్యయనశీలి. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాన్ని, ఇతర శాస్త్రాల్ని బాగా చదువుతారు. వాటితో పాటు చరిత్రను కూడా ప్రత్యేకంగా చదువుతారు. ఆయన చదివినదాన్ని జీర్ణించుకుని దాన్నెలా చెప్పాలో తెలిసిన నైపుణ్యం గలిగిన వారు. ఆయన భౌతికంగా భారతదేశానికి అవతల, దూరంగా ఉన్నారు. కానీ, ఒక భారతీయుడిగా, ఒక తెలుగు పాఠకునిగా, ఒక ప్రేక్షకుడ్నిగా, ఒక వక్తగా మనకంటే దగ్గరగా ఒక విడదీయలేనంత బంధాన్ని పెనవేసుకుని జీవిస్తున్నారు. ఆయన మాట, ఆయన ప్రతిస్పందన, ఆయన గొంతు వింటున్న వాళ్ళలో ఒకనిగా చెప్తున్న మాట ఇది. ఏ సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుందో అదే సామాజిక వర్గం నుండి ఆ మంటల్నార్పడానికి గంగను నెత్తిమీద మోసుకొస్తూ తనవంతుగా కృషిచేస్తున్న సామాజిక సమన్వయదార్శనికుడు. ఇప్పుడు భారతదేశంలో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట్టిందల్లా బంగారమయ్యే ఒక అత్యంత ప్రభావితమైన సామాజిక వర్గానికి చెందిన వాడు. నిజంగా డబ్బు సంపాదించడమో, అధికారాన్ని హస్తగతం చేసుకోవడమో మాత్రమే చేసుకోవాలంటే ఆ వర్గాలకు అన్ని దారులూ తెరుచుకున్న సమయమిది. ఈ పరిస్థితుల్లో ఈ రచయిత సమాజంలో పీడితుల గొంతుగా అక్షరమవుతున్న అనేక సందర్భాల్ని గమనిస్తున్నాను. డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల్ని ప్రచారం చేయడంలో పాత్రధారి కావడాన్ని నేను గమనిస్తున్నాను. దీనిలో భాగంగానే ఈ పుస్తకాన్ని ఆయన రాశారని భావిస్తున్నాను.
ఈ పుస్తకం చదువుతుంటే ఒక ఉద్వేగానికి లోనయ్యాను. ఊపిరి సలపనివ్వని ఉక్కిరి బిక్కిరికేదో గురయ్యాను. పూర్ణ ఒక తండా నుంచి వచ్చిన ఒక గిరిజన యువతి. ఆ అమ్మాయి ఏడు శిఖరాల్ని ఎలా ఎక్కిందో గాని ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నేనే ఎవరెస్ట్ ఎక్కుతున్నంతగా ఫీలయ్యాను. ఆ అమ్మాయే నన్నో మహోన్నత శిఖరం పై కూర్చో పెట్టినట్లు అనిపించింది ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ. ఒక మహాసాహసి జీవిత చరిత్రనేదో చదువుతున్నట్లు, ఒక అద్భుతమైన ప్రపంచాన్నేదో కళ్ళెదుట చూస్తున్నట్లపించింది. రచనా శైలిని చూసినప్పుడు ఒక చరిత్రను, ఒక నవలను మిళితం చేసి చదువుతున్నట్లుగా అనిపించింది. అది చివరివరకూ ఇలాగే కొనసాగితే సాహిత్య విమర్శకులు దీన్నొక నవలగా గుర్తించే వాళ్ళు.
యానాదులు, ట్రైబల్ క్రిమినల్ యాక్ట్ గురించి వెన్నెలకంటి రాఘవయ్య, బంజారాల గురించి డా.డి.బి.నాయక్ మొదలైన వాళ్ళు కొంత పరిశోధనాత్మక రచనలు చేశారు. వీటితోపాటు మరికొన్ని పరిశోధనలు ఈ రచనల్ని ఈ రచయిత నిజాయితీగానే ప్రస్తావించారు. ఈ పుస్తకం రాకముందే మాలావత్ పూర్ణ సాధించిన విజయాల్ని కొంతమంది హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సినిమాలుగా కూడా తీశారు. Poorna (The Youngest Girl in the World to Scale Mount Everest) పేరుతో అపర్ణ తోట ఒక పుస్తకం కూడా రాశారు. దాని తెలుగు అనువాదం కూడా వచ్చింది. ఇక్కడ వీటన్నింటినీ సమీక్షించటం నా ఉద్దేశ్యం కాదు. సుధీర్ రెడ్డి గారి పుస్తకం చదివిన తర్వాత, పూర్ణ 2014లో సాధించిన ఆ విజయం తర్వాత కూడా మరిన్ని రికార్డుల్ని నమోదు చేసినా, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం పైనే ఈ పుస్తకాన్ని కేంద్రీకరిస్తూ రాయడం వెనుక ఒక కారణమేదో ఉందనిపిస్తుంది. అందువల్లే దీన్ని చదివిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయాల్ని ఇలా పంచుకోవడమే దీని లక్ష్యంగా భావిస్తున్నాను.
ఈ రచనాశైలీ ఎవరినైనా ఇట్టే కట్టి పడేస్తుంది. అడవిలో చిన్నప్పుడు తప్పిపోయిన పూర్ణను తండ్రీ వెతికేటప్పుడు రచయిత రాస్తూ ‘‘నీడ తన బిడ్డ క్షేమాన్ని కోరి తన కంటే ముందుగా పరిగెడుతుందట’’ . ఈ రచనలో వర్ణించిన అడవి…ఆ అడవిలో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు వాటి ప్రవర్తన ఎంతో లోతుగా పరిశీలన చేస్తే తప్ప అంత సులువుగా అర్థం కావు. ఈ వర్ణనలు పూర్ణ జీవనశైలిని వాస్తవికంగా ఉంటూ ఆత్మీయం చేస్తున్నాయి. తండ్రి తన కూతురిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గువ్వని అనుసరించటం… సుంకేసుల చెట్ల వర్ణనలు వంటివన్నీ డా.కేశవ రెడ్డి అతడు అడవిని జయించాడు నవలను గుర్తుచేస్తుంటాయి.
దళితులు, గిరిజనులు, శూద్రులు ఇలా వారి చరిత్రలను నిర్మించడంలో చాలామంది చరిత్రకారులు సరైన దృక్పథాన్ని పాటించలేదు. దాన్ని పూరించవలరించవలసిన అవసరం ఉంది. అది ఈ రచనలో కొద్దిగా కనిపిస్తుంది. గిరిజనులు ముఖ్యంగా ఆ తెగల్లోని బంజారాలు ఈ దేశానికి తోడ్పడిన చరిత్రను, సాధారణ చరిత్రకారులు విస్మరించి, చీకటిలోనే దాచేసిన చారిత్రక కోణాల్ని పూర్ణ తండ్రి దేవీదాస్ ద్వారా చెప్పించడం రచయితలోని చరిత్ర రచనా దృక్పథాన్ని, చరిత్ర పునర్నిర్మాణావశ్యకతను స్పురించేలా చేయగలిగారు.
పూర్ణ తన జీవితాన్ని విజయ పంథావైపు పయనించడంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించిన ఐ.పి.యస్. ఆఫీసర్ ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్ గార్ని కర్మయోగిగా అభివర్ణించడంతో పాటు సముచిత రీతిలో ప్రస్తావించడం కూడా ఈ రచనకు నిండుతనాన్ని తీసుకొచ్చింది. రచయిత ఏ రాజకీయ భావజాలాలకు లొంగిపోకుండా రచనను కొనసాగించిన తీరుకీ ఘట్టం ఒక గొప్ప ఉదాహరణ. గిరిజనులు, దళిత, పీడిత జీవితాలతో తన జీవితాన్ని పెనవేసుకున్న ఐ.ఏ.యస్.ఆఫీసర్ ఎస్.ఆర్.శంకరన్ ని ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల సామాజిక పరివర్తనశీలిగా చిత్రించిన విధానం రచయిత పట్ల మేధావుల్లో గౌరవాన్ని కలిగిస్తుంది.ఈ ఇద్దరు మేధావుల ఇంటి పేర్లూ చూస్తే అటు, ఇటు తిరగేసుకున్నారేమోననిపిస్తుంది!
కోచ్ ద్వారా చెప్పిన ప్రతి మాటా ప్రతి ఒక్కరిలోనూ నిరాశను తరిమేసి, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నేనైతే ఆ కోచ్ చెప్పిన మాటల్ని అనేకసార్లు చదువుకున్నాను. కొన్నైతే నా డైరీలో రాసుకున్నాను. మీరూ వీటిని చదివితే ఒక విద్యుత్ శక్తిలాంటి ఉత్సాహాన్ని పొందుతారు.
• ''సామర్థ్యం అనేది ఒక మానసిక స్థితి. సాధారణ ఆలోచనలతో మన మెదడు మొద్దుబారేట్లుగా చేస్తుంటే కొత్త ఆలోచనలు పుట్టవు. ఏ రంగంలోనైనా అడుగు పెట్టేటప్పుడు మీకెంత తెలుసు అనేది ముఖ్యం కాదు. ఆ రంగపు తలుపులు తెరిచాక, ఎంత నేర్చుకుంటారు, ఆ నేర్చుకున్నదాన్ని ఎంత సృజనాత్మకంగా ఉపయోగించు కుంటారనేది ముఖ్యమైన వైఖరి. మనం ఏం చేయగలమనేది, మన మెంచుకున్న రంగంలో ఎంత చేయగలమని అనుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. 'నేను ఏ పనైనా బాగా చేయగలను'అన్న వారికే ప్రపంచం సలాం కొడుతుంది''
• ''మీరు మీలో దేన్నీ చూస్తారో ఇతరులు కూడా బయట నుండి దాన్నే చూస్తారు. దేనికి అర్హులని మీరనుకుంటారో, అది తప్పక మీకు దక్కుతుంది. మీరు నిజంగానే ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ మనస్సు ఎవరెస్ట్ ఎక్కడంలో మీకు దారులు చూపుతుంది. మీ ఆలోచనే అలా జరిగేటట్లు చేస్తుంది"
ఈ పుస్తకం నిండా ఇలాంటివెన్నో స్పూర్తినిచ్చే వాక్యాలున్నాయి. ఇక్కడ నాకు ఎవరెస్ట్ అంటే కేవలం భౌతికంగా ఒక ఎత్తైన శిఖరం మాత్రమేకాదు; మనం సాధించాలనుకున్న లక్ష్యం కూడా ప్రతిధ్వనిస్తుంది. అందువల్ల తెలుగులో రాసిన ఈ పుస్తకానికున్న పేరు ఇంగ్లీషులో ఉన్నా చాలా బాగుంది. అందుకే ఇది పూర్ణ కోసం రాయలేదు!అంటే కేవలం పూర్ణ కోసమే రాయలేదు,మనలో గూడుకట్టుకున్న నిరాశను పోగొట్టుకోవాలనుకొనేవారు పూర్ణను చదవాలని చెప్పడానికి రాశారు. పూర్ణను ఒక స్పూర్తి శిఖరంలా చూపడం కోసం రాశారు. అందుకే ఇది పూర్ణ కోసం రాయలేదు!అంటే కేవలం పూర్ణ కోసమే రాయలేదు, మనలో దట్టంగా. అలుముకున్న చిక్కటి చీకటిని పోగొట్టుకొనే వెలుగునిచ్చే సంపూర్ణ మైన సూర్యశక్తిని మనలోకి ప్రవహింప చేసుకోవడాన్ని రాశారు.
పర్వతారోహణ కోసం అనుమతిస్తూ పూర్ణ తల్లిదండ్రుల సంతకాలు చేసేటప్పుడు తల్లి లోని అనురాగం, తండ్రి లోని మొక్కవోనివ్వని ధైర్యాన్ని వర్ణించే సన్నివేశం ఒక్కసారిగా మనకు తెలియకుండానే ఒక ఉద్విగ్నతకు గురి చేస్తూ మన చెంపల్ని కొన్ని కన్నీటి బిందువులు ముద్దాడి పోతాయి.
పూర్ణ శిఖరారోహణ సమయంలో ఆక్సిజన్ కోల్పోయి, ఊపిరాడని, ఇక నడవలేని స్థితిలో అనేక కష్టనష్టాలను అనుభవిస్తున్నప్పుడు తల్లి గుర్తొస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి తినలేని తిండిని తినాల్సినప్పుడు ఆమెకు కుటుంబం గుర్తుకొస్తుంది. మరలా తిరిగొచ్చేటప్పుడు ఏమికావాలో చెప్పమంటే తల్లి ఎందుకేడుస్తుందో మనకా పరిస్థితుల్ని వర్ణించినప్పుడు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనవుతాం. మరలా నువ్వు తిరిగొస్తే చాలనుకున్న తల్లిమనసుతో మనమూ మమేకమవుతాం.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమంటే మాటలా? నిత్యం దాన్నే వృత్తిగా నమ్ముకున్న షెర్ఫా లెంతమంది ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు? దేశదేశాలకు చెందినవాళ్ళు ఎన్నో సార్లు ప్రయత్నించీ ప్రాణాల్ని కోల్పోయిన వాళ్ళెంతమందో. వాళ్ళ శవాల్ని ప్రత్యక్షంగా చూసింది పూర్ణ. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళడంమంటే మాటలా? పూర్ణ, ఆనంద్ లు చిన్నపిల్లలు. వాళ్ళు ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకుంటే, దాని సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి. ఏదైనా జరిగితే అంత పెద్ద చదువులు చదువుకున్న ప్రవీణ్ కుమార్ కి ఆ మాత్రం తెలీదా అని ఎంతమంది నిందించేవాళ్ళో!
నిరంతరం ఫోన్ ద్వారా వాళ్ళ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్నా, అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో పర్వతారోహకులకు సహకరించి షెర్పాలు చనిపోవడం, అది నేపాల్ ప్రభుత్వాన్ని కుదిపేయడం, ఆ సందర్భంలో వీళ్ళేమయ్యారోనని ఆందోళన చెందినప్పుడు, ఎవరెస్టునెక్కడం కంటే ప్రాణాలతో బయటపడ్డమే ముఖ్యమనిపించే పరిస్థితుల్లో వాళ్ళున్నారనిపించినప్పుడు అక్కడ నుండి తిరిగి వచ్చేయమనే ప్రవీణ్ కుమార్ సూచించారని రచయిత రాశారు. అది ప్రవీణ్ కుమార్ వాళ్ళ పట్ల తీసుకున్న జాగ్రత్తలకు నిదర్శనం.
మరి, ఆ సందర్భంలో వాళ్ళెలా ప్రతిస్పందించారనేది స్వేరో నింపిన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలించేలా రాశారు. పూర్ణ స్వేరో లో చదువుకున్న పది సూత్రాల్లో తొలి సూత్రం ‘‘నేను ఎవరికంటే తక్కువ కాదు’’ అనేది తన ఎవరెస్ట్ శిఖరారోహణకు స్పూర్తి తీసుకుంది. పదో సూత్రం ‘‘నేను మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే దాకా వదలను’’ అనేదాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకుంది. అందుకనే ప్రపంచంలోనే అతి చిన్నవయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. అంతేనా…ప్రతిరోజూ ప్రపంచదేశాల్ని చుట్టివచ్చే ఇండిగో క్యారియర్ లగేజ్ విమానాలపై స్త్రీశక్తి కి గుర్తుగా "పూర్ణ" అనే అక్షరాలు విజయపతాకంగా ఎగిరేలా చేసింది.
పూర్ణ తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వెంటనే డా.బి.ఆర్.అంబేద్కర్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎస్.ఆర్.శంకరన్ గార్లకెలా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసిందో చెప్తూ రచయిత ఈ రచనను అద్భుతంగా ముగించారు. అది మీరు తెలుసుకోవాలంటే చదవాలి.అది ఈ రచనకు ప్రాణం.ఇంత గొప్ప రచనను అందించిన సుధీర్ రెడ్డి గార్ని రచనను పూర్తిగా చదివితే నాతోపాటు మీరూ అభినందించకుండా ఉండలేరు.
ముగించేముందొక మాట చెప్పాలనిపిస్తుంది.
ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ
పూర్ణను ఒక తండ్రిలా ఎత్తుకుని ముద్దాడాలనిపించింది.
పూర్ణ ఎక్కుతుంటే నేనే ఎక్కుతున్నంతగా ఫీలయ్యాను.
విజయం చివరిదాకా వచ్చి ఏ నిస్పృహ గెద్ద తన్నుకుపోతుందోననిపించింది. ఆమె విజయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత, నా మనసంతా తేలికగ్గా మారిపోయింది.సంతోషంతో ఆనందభాష్పాలు రాలిపడ్డాయి.ఆమె అధిరోహించిన ఎవరెస్ట్ శిఖరాన్నిప్పుడు నేనెలాగూ ఎక్కలేను;ఆమెనొక తండ్రిలా ఎత్తుకొనీ ముద్దాడలేను. కానీ, ఆమె నుండి ఓ ఆటోగ్రాఫ్ తీసుకోవాలనిపిస్తుంది.ఆమె ఆటోగ్రాఫ్ ఓ పరిపూర్ణమైన విజయపతాకంగా నిత్యం నాలో రెపరెలాడించుకోవాలనిపిస్తుంది. ఇదే ఈ పుస్తకంలోని ఎవరెస్ట్ ఇన్ మైండ్!
మీ
ఆచార్య దార్ల వెంకటేశ్వరావు
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Everest in Mind.